ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్


పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల కోసం ఎదురు చూసి చూసి ఇక చేసేదిలేక తాము నమ్ముకున్న జాకరమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వింత ఆచారాన్ని పాటించారు రైతులు.. సాలూరు మండలం కూర్మరాజు పేటలో జరిగిన ఈ వింత ఆచారంలో గ్రామస్తులతో పాటు పలువురు పక్క గ్రామాల వారు సైతం పాల్గొని అమలు చేశారు. కూర్మరాజుపేటలో జాకరమ్మ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు.. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువై ఉంది ఈ తల్లి. అమ్మవారిని కొలిచి మొక్కులు చెల్లించి తమ ఆచారాన్ని కొనసాగించేందుకు నడకమార్గంలో గ్రామం నుంచి వందలాది మంది గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఒకేసారి మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలతో కొండపైకి వెళ్లారు. అక్కడకి వెళ్లిన తరువాత జాకరమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తరువాత మొక్కులు కోసం తమతో తీసుకువచ్చిన మేకలు, గొర్రెపోతులు, కోళ్లను అమ్మవారికి చూపించి బలి ఇచ్చారు. బలి కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారి కోసం పాయసం వండారు. ఆచారం ప్రకారం ఆ పాయసాన్ని వరద పాయసం అని పిలుస్తారు.

గ్రామస్తులు అందరూ కలిసి వండిన ఆ వరద పాయసాన్ని ముందుగా ఎవరికి వారే ఆకుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెడతారు.. తరువాత మిగిలిన పాయసాన్ని అమ్మవారి సమక్షంలోనే కొండ పనుగుగా పిలవబడే కటిక నేలపైన వడ్డిస్తారు. అలా వడ్డించిన పాయసాన్ని గ్రామంలోని రైతులు అంతా వరుసగా మోకాళ్ళ పై కూర్చొని నాలుకతో నాకుతారు. ఈ తంతు అంతా జరగటానికి సుమారు ఏడు గంటల సమయం పట్టింది. అలా ఆ తంతు పూర్తయిన తరువాత గ్రామస్తులు అంతా అప్పటికప్పుడే అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు. తాము చేసిన పూజల్లో నిజాయితీ ఉంటే, అమ్మవారికి తమపై కరుణ ఉంటే, తాము పెట్టిన ప్రసాదానికి అమ్మవారు సంతోషిస్తే వర్షం పడేలా అనుగ్రహిస్తుందని వారి నమ్మకం.. అంతేకాకుండా అలా వర్షం పడితే అమ్మవారు కరుణించిందని, తమ పంట పొలాల్లో సిరులు కురుపిస్తాయని వారి నమ్మకం. అలా విశ్వాసంతో ఎదురు చూసిన ఆ గ్రామస్తుల నమ్మకం ఫలించింది. అందరూ ఎదురు చూస్తుండగానే మేఘాలు కమ్ముకొని వర్షం ప్రారంభమై సుమారు గంట పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో గ్రామపెద్దలు చెప్పిన ఆచార వ్యవహారానికి గౌరవం దక్కింది.. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. అందరూ సంతోషంగా తిరిగి గ్రామానికి బయలుదేరారు గ్రామస్తులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *