
హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బిఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు వెనక వైపు నుంచి కిటికీ ఇనుప చువ్వలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు ఎంత చోరీ జరిగింది అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకులోని సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. బ్యాంకులోని ఇనుప లాకర్ మెయిన్ డోర్ కూడా దుండగులు పగలగొట్టారు. నిన్న ఆదివారం సెలవు దినం అవడంతో… ఇవాళ బ్యాంకుకు వచ్చిన తర్వాత బ్యాంకు సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ నెల 21న తెలంగాణలోని సూర్యపేటలోనూ భారీ దొంగతనం జరిగింది. జువెలరీ షాపులో ఐదుగురు నిందితులు 2.05కిలోల బంగారం చోరీ చేశారు. వీరిలో ముగ్గురు నేపాల్ దేశస్థులుకాగా ఇద్దరు ఝార్ఖండ్‌కు చెందిన వారు. నిందితులు షాపుకు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని రెక్కీ నిర్వహించిమరీ కొల్లగొట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.