ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నీపర్ డాగ్‌గా విశేష సేవలందించిన డాగ్ లక్కీ మరణించింది. సుమారు 10 ఏళ్ల పాటు సేవలందించిన లక్కీ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో పోలీసులు డాగ్ లక్కీ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించారు. కుక్క భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నతాధికారులు లక్కీ పార్ధీవ దేహానికి పూల మాలల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
పోలీస్ జాగిలం లక్కీ ఒక లాబ్రాడార్ రీట్రీవర్ జాతికి చెందినది. ఇది 2015లో జన్మించింది. ఇది హైదరాబాదులోని ఐఐటీఏ, ఐఎస్‌డబ్ల్యూ ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైన్ అయ్యింది. సిహెచ్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందింది. వీఐపీలు వచ్చే సమయంలో వారి భద్రత కొరకు చేపట్టే చర్యల్లో లక్కీ చురుకుగా పాల్గొనేది. ఎక్స్‌ప్లోజివ్స్‌ను గుర్తించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టేది. 10ఏళ్ల పాటు లక్కీ తనదైన నైపుణ్యన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించింది. వివిధ బందోబస్తులలో, ప్రముఖుల పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడడంలో ముఖ్య పాత్ర పోషించింది. చివరకు అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..