తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు సమయం కోరారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల కారణంగా సోమవారం విచారణకు రాలేనని సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కారణంగా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు హాజరుకాలేకపోతున్నానని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీ వెల్లడిస్తానని లేఖ ద్వారా అధికారులకు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనను సిట్ సాక్షిగా విచారించనుంది.
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌రావు ఫోన్లో పలు రికార్డింగ్‌లు బయటపడ్డాయి. చాట్ హిస్టరీలో ట్యాపింగ్‌కు పాల్పడ్డ మెసేజ్లున్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. ట్యాపింగ్‌పై ఇప్పటికే 200 మంది స్టేట్మెంట్ తీసుకున్నారు. ట్యాపింగ్ లిస్ట్‌లో CM రేవంత్, కుటుంబ సభ్యులు.. ఈటల రాజేందర్, పొంగులేటి, బండి సంజయ్, రాజగోపాల్, వివేక్ ఉన్నట్లు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండు రకాలుగా అక్రమాలు సాగాయని గుర్తించింది సిట్. నేరుగా కొన్ని నెంబర్లను ట్యాప్ చేసింది ప్రణీత్ రావ్ అండ్ టీమ్. మరికొన్ని నెంబర్లు కాల్ డేటా రికార్డింగ్ లిస్ట్ తీసింది. CDR లిస్ట్ కోసం కేంద్ర ప్రభుత్వ SOPలు పాటించకుండానే ఇష్టానుసారంగా అనేక మంది కాల్ డేటా రిట్రీవ్ చేశారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఎంపీలు రఘునందన్, ఈటల రాజేందర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు రఘునందన్. గతంలోనే ట్యాపింగ్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన రఘునందన్.. సిట్ అధికారులకు కూడా ట్యాపింగ్‌పై వివరాలిచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజురు కావాల్సిందిగా కోరారు. ఈ నెల 28న హాజరవుతానని గతంలో సిట్ అధికారులకు బండి సంజయ్ తెలిపారు. తాజాగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా వేసుకున్నారు.