
సహోద్యోగులకు సహాయకారిగా ఉండటంతో పాటు, ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడటం ప్రతి ఉద్యోగి బాధ్యత. అయితే, కొందరు ఉద్యోగులు తమ ప్రవర్తనతో ఇతరులకు చిరాకు తెప్పిస్తూ, మొత్తం పని వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంటారు. అటువంటి ఐదు అలవాట్లు ఏమిటో చూద్దాం.
1. సమయపాలన లేకపోవడం, పనిలో ఆసక్తి చూపకపోవడం:
కొంతమంది ఉద్యోగులు ఎప్పుడూ ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంటారు. అంతేకాదు, తమ పనిపై అంతగా ఆసక్తి చూపరు. సహోద్యోగులు ఏదైనా సందేహం అడిగినా, దాన్ని నివృత్తి చేయకపోవడం లేదా విషయాన్ని పక్కదారి పట్టించడం వంటి ‘టాక్సిక్’ ప్రవర్తన వీరిలో కనిపిస్తుంది. ఇది ఇతరుల పనిని ఆలస్యం చేయడమే కాకుండా, సమూహం ఉత్పాదకతను తగ్గిస్తుంది.
2. బాధ్యతారాహిత్యం, ఆధిపత్య ధోరణి:
కొందరు ఉద్యోగులు ఆఫీసు బాధ్యతను తమ మీద వేసుకోకుండా, తమకు ఏమీ పట్టనట్టుగా ఉంటారు. నిర్ణీత సమయానికి రావడం, మీటింగ్‌లలో పాల్గొనడం వంటి ప్రాథమిక నిబంధనలను కూడా పాటించరు. ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు, తామే హైలైట్ అవ్వాలనే ధోరణితో ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. అలాంటి వారిని చూసినప్పుడు సహోద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
3. కమ్యూనికేషన్ లోపం, అప్‌డేటెడ్‌గా ఉండకపోవడం:
కొంతమంది ఉద్యోగులకు సరైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండవు. అంతేకాదు, వారు తమను తాము అప్‌డేట్ చేసుకోరు. ఇది గ్రూపులో ఉన్న ఇతరులతో గొడవలకు దారితీయవచ్చు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించడానికి, సహకరించడానికి సిద్ధంగా ఉండాలి. మెరుగైన కమ్యూనికేషన్ పనిలో సామరస్యాన్ని పెంచుతుంది.
4. గ్రూపులుగా విడిపోవడం, కుట్రలు చేయడం:
మరికొందరు ఉద్యోగులు ఒకరిద్దరు కలిసి ఒక గ్రూపుగా (కోటరీ) తయారై, ఒకరిని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేయడం, లేనిపోనివి సృష్టించడం చేస్తుంటారు. ఇది కార్యాలయ వాతావరణాన్ని విషపూరితంగా మారుస్తుంది. నిరంతరం కబుర్లు చెప్పుకోవడం, ఇతరుల గురించి ఆరా తీయడం వంటివి పనిపై ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ప్రవర్తన పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
5. బాస్ పాత్ర, ప్రాధాన్యతలో లోపం:
ఒక బాస్ లేదా టీమ్ లీడర్ గ్రూపును సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం చాలా ముఖ్యం. కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉద్యోగుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. బాగా పనిచేస్తున్న ఉద్యోగులపై ‘టాక్సిక్’ వ్యక్తుల ప్రభావం పడకుండా గుర్తించి, దాన్ని నివారించడం బాస్ బాధ్యత. లేకపోతే, ఇది దీర్ఘకాలంలో సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అలవాట్లను గుర్తించి నివారించడం ద్వారా, మంచి ఆఫీస్ వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.