అటు సరోగసీ బాగోతాలు.. ఇటు స్పెర్మ్ కలెక్షన్ దందాలు.. తిలాపాపం..తలా పిడికిడు అన్నట్టుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు.. ఇటు స్మెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్. నో హ్యుమానిటి. ఓన్లీ మనీ మనీ అన్నట్టుగా రెచ్చిపోయాయి. సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సరోగసీకి మనదేశ చట్టాలు అనుమతి ఇస్తాయా.? ఇస్తే ఎలాంటి కండీషన్స్ పాటించాలి.? స్పెర్మ్ కలెక్షన్‌కు ఎలాంటి రూల్ ఫాలో కావాలి..? ఈ కథనంలో తెలుసుకోండి..
సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసు దాడుల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెర్మ్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నట్లు తేలింది. వీటిని అనధికారికంగా సేకరించబడి, నిల్వ చేయబడ్డాయని పోలీసులు తెలిపారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ -ART చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ, టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సరోగసి కోసం స్పెర్మ్ సేకరిస్తున్న టెక్ క్లినిక్ నిర్వాహకులు.. స్పెర్మ్‌ని అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు రూ.5వేల నుంచి 10వేలు ఇస్తున్నట్లు తెలిపారు. స్పెర్మ్ టెక్ క్లినిక్‌కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న 16 స్పెర్మ్ శాంపిల్స్ ను DMHOకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గోపాలపురంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో చీకటి బాగోతాలు చాలా ఉన్నాయని విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమ కార్యకలాపాలు కొత్తేమీ కాదు. 2017లో, బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమ సరోగసీ కార్యకలాపాలు బయటపడ్డాయి, ఇక్కడ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సరోగసీ కోసం ఒప్పందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సరోగసీకి అనుమతి లేని విదేశీ జంటలకు సేవలు అందించినట్లు తేలింది. 2018లో, ఢిల్లీలో స్పెర్మ్, గుడ్డు దొంగతనం కేసులో హైదరాబాద్‌కు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది.
కమర్షియల్ సరోగసీ మనదేశంలో పూర్తిగా నిషేధం.. అయినప్పటికీ..
మనదేశంలో సరోగసీ, స్పెర్మ్ సేకరణలకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కమర్షియల్ సరోగసీ మనదేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ .,.అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ..ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలై ఉండాలి, 25-35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, ఒక సారి మాత్రమే సరోగేట్‌గా ఉండగలదు. ఇంటెండెడ్ పేరెంట్స్ భారతీయ జంటలై ఉండాలి, విదేశీ జంటలకు సరోగసీకి అనుమతి లేదు. ART చట్టం ప్రకారం, స్పెర్మ్ సేకరణ కోసం ART బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పెర్మ్ డోనర్లు 21-55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, HIV, హెపటైటిస్ B, C వంటి వ్యాధుల కోసం పరీక్షించబడాలి. జన్యు వ్యాధుల కోసం ఫ్యామిలీ హిస్టరీ కూడా తనిఖీ చేయబడాలి. ఒక డోనర్ స్పెర్మ్ 75 సార్లు మాత్రమే ఉపయోగించబడుతుంది. స్పెర్మ్ నిల్వ కోసం క్రయో-ట్యాంకులు -196°C వద్ద నిర్వహించబడాలి. ఒకవేళ ఈనిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించబడవచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసీ సెంటర్స్ రెచ్చిపోతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..