నవ్విపోదురుగాక.. నాకేమి సిగ్గు అన్న తీరుగా ఉంది ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారుల వ్యవహారం. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు రెండేళ్లకే కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. వందేళ్లు ఉండాల్సినవి.. ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంద్రాలు పడి శిథిలావస్థకు చేరుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇటేవలి కట్టిన కొత్త బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉంది. మహబూబ్‌నగర్ – తాండూరు అంతర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నది పై రూ. 16 కోట్ల 80 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడింది. ప్రారంభించిన రెండేళ్లకే బ్రిడ్జి పగుళ్లు పట్టింది. దీంతో ఆ బ్రిడ్జి పైనుండి వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
వందేళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల కాంట్రాక్టర్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులను గుర్తించకుండా వదిలేసిన అధికారులపైనా మండిపడుతున్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకొని వెంటనే కాగ్నా నది బ్రిడ్జికి మరమ్మత్తులు చేపట్టాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుతున్నారు. వాహనదారులు రంద్రాన్ని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.