తెలంగాణ

తెలంగాణ


హెచ్‌సీఏ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.దాదాపు 16 రోజులు అయిదు రాష్ట్రాల్లో మకాం చేశాడు. పగలంతా కారులో ప్రయాణం చేసి రాత్రింతా ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈకేసు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు దేవరాజ్ ఎత్తుగడలు వేశాడు. చివరకు సీఐడీ నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 36 గంటలపాటు నిరంతరం ఆపరేషన్ చేపట్టారు. అతడు ఎన్ని ఎత్తులు వేసిన పోలీసులకు దొరికక తప్పలేదు. శుక్రవారం తెల్లవారుజామున పుణేలోని ఓ హోటల్లో అతడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరిలించారు. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చిన అనంతరం విమానంలో అతడిని హైదరాబాద్ తీసుకొచ్చి రాత్రి మల్కాజిగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య ఆరుకు చేరింది.

ఇదే కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితుల్ని ఈనెల 9న సీఐడీ ఆరెస్ట్ చేయగా.. దేవరాజ్ తప్పించుకుని పారిపోయాడు.. అప్పటినుంచి సీఐడీకి దొరక్కుండా తప్పించుకునేందుకు దేవరాజ్ తన సొంత కారులో డ్రైవర్ తోపాటు మరో వ్యక్తితో కలిసి పలు ప్రాంతాలకు తిరుగుతూనే ఉన్నట్లు సీఐడ అధికారులు గుర్తించారు. మొదటగా హైదరాబాద్ నుంచి భద్రాచలం చేరుకున్న దేవరాజ్ బృందం అక్కడి నుంచి ఏపీలోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి, కాకినాడల్లో తిరిగి యానాంకు చేరుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లారు. తమిళనాడులో కోయంబత్తూర్, ఊటీ మీదుగా తిరుగుతూ కర్ణాటకకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి హుబ్బళి మీదుగా తిరిగి కర్నూల్, అనంతపూర్‌కు మకాం మార్చారు. మళ్లీ కర్ణాటకలోకి ప్రవేశించి.. అక్కడినుంచి గోవాకు వెళ్లారు. అనంతరం మహారాష్ట్రలోకి ప్రవేశించి పుణేకు చేరుకున్నారు. అలా పగలంతా కారులో తిరుగుతూ.. రాత్రివేళ మాత్రం స్టార్ హోటళ్లలో బస చేస్తున్నట్లు విచారణలో తేలింది. తమ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి ఉంచుతూ అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి వినియోగించినట్లు సిఐడీ అధికారులు గుర్తించారు…

దేవరాజ్ను పట్టుకునేందుకు సీఐడీ నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టింది. సీఐడీ కార్యాలయంలోని సాంకేతిక బృందం ఇతర రాష్ట్రాల్లోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దేవరాజ్ గురించి ఆరా తీశారు. కారు టోల్ గేట్లు దాటుతున్న తీరును పరిశీలిస్తూ క్షేత్రస్థాయి బృందాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసింది. ఈ క్రమంలో గురువారం దేవరాజ్ బృందం గోవాలో ఉన్నట్లు తేలడంతో అప్పటినుంచి 36 గంటలపాటు నిరంతరంగా నిఘాగా ఉంచారు. దేవారాజ్ పుణేకు చేరుకున్నట్లు పక్కాగా సమాచారం అందడంతో సీఐడీ బృందం విమానంలో వెళ్లి గురువారం అర్ధరాత్రి సమయంలో అక్కడి హోటల్‌కు చేరుకున్నారు. హోటల్లో దేవరాజ్ గదికి వెళ్లేందుకు తొలుత హోటల్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఐడీ బృందం తామెవరో వివరించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారని సమాచారం. నిద్రమత్తులోనే తలుపు తీసిన దేవరాజ్ బృందాన్ని పట్టుకొని విమానంలోనే తిరిగి హైదరాబాద్‌కు తరిలించారు..

ఈ కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజిగిరి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, కార్యదర్శి రాజేందర్యాదవ్‌లకు బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడు జగన్మోహన్ రావును మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ ఇటీవలే దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *