
తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు.. కాకులుదూరని కారడివిలో చిక్కుకొని వర్షంలో దిక్కు తోచని స్థితిలో హాహాకారాలు చేశారు.. ఆరు గంటలకు పైగా అడివిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు.. చివరకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు.. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించినా అధికారుల కళ్ళుగప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పుకొని తెచ్చుకున్నారు. చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలో దారితప్పిన వారంతా వరంగల్ NIT విద్యార్థులే…
ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం అడవుల్లో జరిగింది.. వరంగల్ లోని NIT లో బీటెక్ చేస్తున్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం ఉదయం వెంకటాపురం వెళ్లారు.. అక్కడ బొగత జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించడంతో అటవీశాఖ అధికారులు, పోలీసుల కళ్ళుగప్పి మైతాపురం జలపాతాల సందర్శనకు వెళ్లారు..
వీడియో చూడండి..
ప్రమాదాలు పొంచి ఉన్నాయని ముందే అలర్ట్..
నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి సెల్ఫీల కోసం వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు.. తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పారు.. సాయంత్రం నాలుగు గంటలకు దారితప్పిన ఆ విద్యార్థులు వర్షంలోనే అడవిలో ఉండిపోయారు. ఎంత వెతికినా గమ్యం తెలియక పోవడం చివరకు 100కు ఫోన్ చేసి వాళ్ళ సమాచారం అందించారు..
సమాచారం తెలుసుకున్న వెంటనే వెంకటాపురం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కుండపోత వర్షంలోనూ వాళ్ళ లొకేషన్ ఆధారంగా అక్కడికి కాలినడకన చేరుకొని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. దాదాపు 6 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..
అడవిలో దారితప్పిన వారిలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.. వీరంతా వరంగల్‌లోని ఎన్ఐటిలో బీటెక్ చేస్తున్నారు.. వీకెండ్ కావడంతో సరదాగా గడపడం కోసం వచ్చి ఇలా ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. వారిని వెంకటాపురం తీసుకొచ్చిన తర్వాత ఆహారం నీళ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడనుండి ప్రత్యేక వాహనంలో హనుమకొండకు తరలించారు.
అయితే ప్రస్తుతం కుండపోత వర్షాల నేపథ్యంలో జలపాతాల సందర్శనకు అనుమతి లేదు.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి జలపాతాల సందర్శనకు వెళ్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు, అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..