
ఆహార విషబాధ, కలుషితమైన నీళ్లు, అజీర్ణం లాంటివి విరేచనాలకు ముఖ్య కారణాలు. ఇవి శరీరం నుండి నీటిని తగ్గించి డీహైడ్రేషన్ కు దారి తీస్తాయి. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇది త్వరగా తగ్గుతుంది. విరేచనాలకు అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, అరటిపండు మిశ్రమం
అరటిపండులో ఉండే పొటాషియం శరీరంలోని లోపాలను సమతుల్యం చేస్తుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా వల్ల మల విసర్జన కంట్రోల్ లో ఉంటుంది. ఈ రెండూ కలిస్తే జీర్ణవ్యవస్థను బలంగా చేసే సహజ ట్రీట్ మెంట్ లా పనిచేస్తాయి. ఒక మెత్తటి అరటిపండును మెత్తగా చేసి.. సగం కప్పు పెరుగు కలిపి తీసుకోండి. రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
జీలకర్ర, మజ్జిగ
జీలకర్ర సహజంగా కడుపులోని ఇన్ ఫెక్షన్లపై పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే ల్యాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇవి కలిస్తే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఒక గ్లాసు మజ్జిగలో అర టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తాగాలి. రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది.
దానిమ్మ రసం
దానిమ్మలో ఉండే సహజ గుణాలు మలాన్ని గట్టిగా చేయడంలో సహాయపడతాయి. ఇది డీహైడ్రేషన్ రాకుండా కూడా కాపాడుతుంది. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్ సి లాంటి పోషకాలు అందుతాయి. తాజాగా తీసిన దానిమ్మ రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే ఉపశమనం దొరుకుతుంది.
అల్లం, పసుపు టీ
అల్లం శరీరంలోని వాపును తగ్గిస్తుంది. పసుపుకు యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులపై పనిచేస్తుంది. ఈ మిశ్రమంతో టీ తాగడం ద్వారా కడుపు హాయిగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో తురిమిన అల్లం, కొద్దిగా పసుపు వేసి మరిగించి వడకట్టిన తర్వాత తాగాలి. రోజులో రెండుసార్లు తాగాలి.
కొబ్బరి నీళ్లు
ఈ సహజ డ్రింక్ లో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. దీని వల్ల విరేచనాల వల్ల కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే సరిపోతుంది. ఇది శరీరానికి ఫ్రెష్ నెస్ ను ఇస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఈ వెనిగర్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విరేచనాలకు కారణమయ్యే హానికరమైన సూక్ష్మజీవులను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి. రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
సైలియమ్ హస్క్ పౌడర్ (Psyllium Husk Powder)
ఇది జీర్ణవ్యవస్థలో నీటిని పీల్చుకొని మలాన్ని గట్టిగా చేస్తుంది. ఇది సహజమైన ఫైబర్ కావడం వల్ల జీర్ణక్రియకు సపోర్ట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ సైలియమ్ హస్క్ పౌడర్ ను నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల మల విసర్జన సులభం అవుతుంది.
మరిన్ని జాగ్రత్తలు మీకోసం
- ఎక్కువ నీళ్లు, కొబ్బరి నీళ్లు, సూప్ లు లాంటివి తీసుకుంటూ.. శరీరం నుండి నీరు పోకుండా చూసుకోండి.
- మసాలా ఎక్కువగా ఉండే లేదా బాగా నూనె వేసిన ఆహారం తినకూడదు.
- శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు తరచూ కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
ఈ ఇంటి చిట్కాలు సహజంగా పనిచేస్తాయి. కానీ రెండు రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోతే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)