వర్షాకాలంలో చాలా మంది రుచిగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో తేమతో కూడిన గాలిలో, జీర్ణక్రియ కొంచెం నెమ్మదిస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే దానిపై క్లారిటీ ఉండాలి.
ముఖ్యంగా పండ్ల విషయానికి వస్తే వర్షాకాలంలో కొన్నింటిని అస్సలు తినకూడదు. చాలా మందికి సీజన్ ఏదైనా అరటిపండ్లు, యాపిల్స్ తింటుంటారు. నిజానికి, రెండూ పోషకమైనవవే. అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో అరటిపండ్లు తినడం వల్ల కఫం వస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, కడుపు సమస్యలు వస్తాయి. గ్యాస్, మలబద్ధకం, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అందుకే వర్షాకాలంలో అరటిపండ్లు తినకూడదు. వాటిని తినవలసి వస్తే, పగటిపూట మాత్రమే తినాలి.
యాపిల్స్ తేలికగా జీర్ణమయ్యే ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాపిల్స్ శరీరాన్ని శుభ్రంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. యాపిల్స్ లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని తొక్కతో కలిపి తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు ఆపిల్స్ ను అల్పాహారంగా, సాయంత్రం స్నాక్ గా తినడం మంచిది.
లిచీ వర్షాకాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది. లిచీ శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా ఇది యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వర్షాకాలంలో దానిమ్మ మరో గొప్ప ఎంపిక. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. శరీరాన్ని బలపరుస్తుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
అలాగే ప్లం పండ్లు కూడా వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వర్షాకాలంలో బొప్పాయి తినడం కూడా మంచిదే. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేమతో కూడిన వాతావరణంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.