హెల్త్‌

హెల్త్‌


ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ సర్వసాధారణం. అభిప్రాయభేదాలు కారణంగా తలెత్తే గొడవలు పరిమితికి మించి జరిగితే ఇంటి వాతావరణం క్షీణిస్తుంది. అది ఆ ఇంటి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గొడవపడితే పిల్లలు మానసికంగా నిరాశకు గురవుతారు. అది వారి మనస్సును ఎంతగానో బాధిస్తుంది. తల్లిదండ్రుల మధ్య గొడవ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

తల్లిదండ్రుల గొడవలు పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయంటే?

భావోద్వేగ ఒత్తిడిని సృష్టిస్తుంది

పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారి తల్లిదండ్రులు గొడవ పడిన ప్రతిసారీ ఎంతో బాధను అనుభవిస్తారు. పిల్లలు అలాంటి వాతావరణంలో పెరిగితే వారి భవిష్యత్తుపై దాని ప్రభావం పడుతుంది. నిత్యం ఆందోళన, విచారం, అభద్రతను పెంచే అవకాశం ఉంది.

తల్లిదండ్రుల పట్ల కోపం

పిల్లలు తమ తల్లిదండ్రులు పదే పదే గొడవ పడుతుండటం చూసినప్పుడు, వారు తమ తల్లిదండ్రులలో ఒకరిపై లేదా ఇద్దరిపైనా కోపం, ద్వేష భావాలను పెంచుకుంటారు. వారే దీనికి కారణమని నమ్ముతారు. ఇది వారి భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా బలహీనపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

నిరంతర గొడవలు, వాదనలు ఉండే వాతావరణంలో పెరిగే పిల్లలు నిరాశ, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లిదండ్రుల తగాదాలను చూసిన తర్వాత పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

ఆత్మవిశ్వాసంపై ప్రభావం

తల్లిదండ్రుల మధ్య తరచుగా జరిగే తగాదాలు పిల్లలలో అభద్రతా భావానికి, అపరాధ భావనకు దారితీస్తాయి. ఇది తరువాత వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

చెడు ప్రవర్తనను అనుకరించడం

పిల్లలు తాము చూసే దాని నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు గొడవ పడటం చూస్తే, పిల్లలు కూడా బిగ్గరగా మాట్లాడటం, గొడవ పడటం అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తులో వారి సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకోలేరు

పిల్లలు తమ తల్లిదండ్రులు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం చూసే బదులు ప్రతిసారీ గొడవపడటం చూస్తే, వారు కూడా కోపంగా మారి అదే విధంగా పోరాడుతారు. సానుకూల మార్గంలో ఎలా పరిష్కరించాలో వారికి ఎప్పటికీ తెలియదు.

విద్య – ఆరోగ్యంపై ప్రభావం

ఇంట్లో తల్లిదండ్రుల మధ్య నిరంతరం జరిగే తగాదాలు పిల్లలను మానసికంగా నిరాశకు గురి చేస్తాయి. ఇది వారి చదువులు, ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. వారు తమ చదువులపై దృష్టి పెట్టలేకపోతారు. మరోవైపు ఇది చిన్న వయస్సులోనే ఒత్తిడి, నిరాశ మొదలైన మానసిక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదు.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *