హెల్త్‌

హెల్త్‌


హెల్త్‌

గతంలో ప్రజలు ఎక్కువగా శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడు.. నేటి యువతరం ఎక్కువగా స్క్రీన్ ముందు గడిపే జీవనశైలికి అలవాటు పడింది. ఇది వారి వెన్నెముక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. శరీరానికి అవసరమైన కదలికలు తగ్గడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తున్నాయి.

ఎక్కువసేపు కూర్చునే అలవాటు

చాలా మంది యువత ఆన్‌ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, గేమింగ్, సోషల్ మీడియా లాంటి కారణాలతో గంటల తరబడి కుర్చీలో కూర్చుంటూ ఉంటారు. ఈ స్థితిలో సరైన భంగిమ లేకపోవడం, మెడను ముందుకు వంచడం లాంటి వాటి వల్ల వెన్ను మీద ఒత్తిడి పెరుగుతుంది. చాలా కాలం ఇలా చేస్తే నడుము నొప్పికి దారి తీస్తుంది.

దీర్ఘకాలిక నొప్పికి కారణం

పక్కవైపు వంగి ఫోన్ వాడటం, కుర్చీలో ముందుకి వంగి కూర్చోవడం లాంటి అలవాట్లు టెక్ నెక్ అనే సమస్యకు కారణం అవుతున్నాయి. ఇది మెడ, భుజాల్లో విపరీతమైన నొప్పిగా మారుతుంది. కొన్నిసార్లు తలనొప్పి కూడా రావచ్చు. దీని వల్ల నెమ్మదిగా వెన్ను భాగం కూడా ఎఫెక్ట్ అవుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం

బయట ఆడటం, వ్యాయామం చేయడం లాంటి శారీరక కార్యకలాపాలు ఇప్పుడు చాలా మంది యువతలో బాగా తగ్గిపోయాయి. దీని వల్ల వెన్నుకు సాయపడే కండరాలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కండరాలు, వెనుక భాగంలోని మద్దతిచ్చే కండరాలు బలహీనపడినప్పుడు, నడుమునొప్పి సమస్య మొదలవుతుంది.

నిద్ర సరిగా లేకపోవడం

స్మార్ట్‌ఫోన్ చూస్తూ నిద్ర పోవడం, తక్కువ నాణ్యత గల దిండు లేదా పరుపు వాడటం వల్ల నిద్ర సమయంలో శరీరానికి సరైన సపోర్ట్ దొరకదు. దీని వల్ల వెన్నుపై ఒత్తిడి ఏర్పడుతుంది. శరీరానికి విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఆహారపు అలవాట్లు

వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే.. ఈజీగా తయారయ్యే ఫాస్ట్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. దీనికి తోడు బరువు పెరగడం వల్ల వెన్నుపై భారం పడుతుంది. పోషకాల లోపం వల్ల కండరాలు బలహీనమవుతాయి. ఇది నొప్పులకు దారితీస్తుంది.

మానసిక ఒత్తిడి ప్రభావం

నేటి యువతరంలో చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడాలి అనే విషయాలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది. మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మెడ, భుజాల వద్ద ఉండే కండరాలు గట్టిగా బిగుసుకుంటాయి. దీనిని పట్టించుకోకపోతే.. అది దీర్ఘకాలిక నొప్పికి కారణమవుతుంది.

ఈ మారిన జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. యువత తగినంత శారీరక శ్రమ, సరైన నిద్ర, పోషకాహారం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే చాలా కాలం పాటు నొప్పులు లేకుండా ఉండగలుగుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *