
గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజు గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్ (విటమిన్ బి2), విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6, కాల్షియం, జింక్, క్యాలరీ ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు గుడ్లలో కనిపిస్తాయి.
ఇది కండరాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఒక గుడ్డులో 186 mg ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల HDL కొలెస్ట్రాల్ పెరుగుతుందని, LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్
హెచ్‌డీఎల్‌ను మంచి కొలెస్ట్రాల్ అంటారు. మంచి మొత్తంలో హెచ్‌డీఎల్ ఉన్నవారు.. వారికి గుండె సంబంధిత సమస్యలు, ఒత్తిడి, అనేక ఆరోగ్య సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం గుడ్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అంటే LDL తగ్గుతుందని తేలింది. ప్రజలు అల్పాహారం లేదా స్నాక్స్ సమయంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. అందుకే ఇది ఆరోగ్యానికి నిజంగా ప్రయోజనకరంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది.
గుడ్లు తింటే చెడు కొలెస్ట్రాల్..
ఉడికించిన గుడ్ల నుండి పాన్‌ఫ్రైడ్ వరకు.. గుడ్ల విషయానికి వస్తే వివిధ సర్వేల్లో వివిధ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌత్ ఆస్ట్రేలియా వర్సిటీ పరిశోధకలు కీలక విషయాలు వెల్లడించారు. గుడ్డు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని తేలింది. కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ ప్రభావాలను విడిగా పరిశీలించాక ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు. గుడ్లను.. అధిక కొలెస్ట్రాల్, తక్కువ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలతో కలిపి తిన్నప్పుడు.. చెడు కొలెస్ట్రాల్ పెరగదని పరిశోధకులు చెబుతున్నారు. బదులుగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెరుగుతుందన్నారు.
పరిశోధన ఇలా..
61 మందిని ఎంపిక చేసి.. వారికి 5 వారాల పాటు మూడు వేర్వేరు ఆహారాలను ఇచ్చారు. మొదటి ఆహారంలో అధిక కొలెస్ట్రాల్, తక్కువ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు ఉన్నాయి. రెండవ ఆహారంలో తక్కువ కొలెస్ట్రాల్, ఎక్కువ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు ఇచ్చారు. మూడవ దానిలో అధిక కొలెస్ట్రాల్, అధిక సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక గుడ్డు కూడా ఉంది.సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే ఆహారాలు LDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి పనిచేస్తాయని ఈ పరిశోధనలో తేలింది. అధిక కొలెస్ట్రాల్, తక్కువ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచవని ఇది నిరూపిస్తుంది. అయితే ఉడికించిన గుడ్లను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..