ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేశామన్నారు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. రహదారుల భద్రతపై రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. మహిళ ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. రెండు వేల ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఇబ్బందిపడే ఆటో డ్రైవర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.
ఇక.. వచ్చే 15 నుంచి ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో తెలిపేలా జీరో ఫేర్ టిక్కెట్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. మహిళా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు?.. టిక్కెట్ ధర ఎంత?.. ప్రభుత్వం ఎంత మేర రాయితీ ఇప్తోంది?.. అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
అలాగే.. ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న పథకంతో ఆయా ప్రభుత్వాలపై ఎంత వ్యయం పడుతోంది?.. ఏపీకి ఎంత భారం అయ్యే అవకాశం ఉంది?.. అనే వాటిపైనా ఆరా సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి మహిళ ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని.. ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేసమయంలో పథకం అమలు నేపథ్యంలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని.. వీటి ద్వారా వ్యయం తగ్గుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే.. రెండు వేలు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు.
కూటమి హామీల్లో భాగంగా మహిళలు రాష్ట్రమంతటా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లొచ్చని, ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఐదు రకాల బస్సుల్లో ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణించేలా అమలు చేస్తున్నామని చెప్పారు.