ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పటికే.. కోట్లాది మంది ఈ మధుమేహం వ్యాధి బారిన పడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం లేదా చక్కెర వ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత.. ఇందులో రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేకపోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. దీర్ఘకాలిక మధుమేహం గుండె, రక్త నాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలకు హాని కలిగించవచ్చు.
అయితే.. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు.. రక్తంలో అధిక చక్కెర స్థాయి సమస్యను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.. లేకుంటే మీ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయి కారణంగా శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను చాలామంది తెలిసి లేదా తెలియకుండానే విస్మరిస్తుంటారు.. ఇది ఇంకా ప్రమాదంలో పడేలా చేస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే.. ఉదయాన్నే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అలాంటి కొన్ని లక్షణాల గురించి అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం.. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి..
అలసిపోయినట్లు అనిపించడం..
మీరు ఉదయం నిద్రలేవగానే అలసిపోయినట్లు అనిపిస్తుంటే.. ఈ లక్షణాన్ని చిన్నదిగా భావించి విస్మరించకూడదు. నిజానికి, రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, మీ శక్తి స్థాయిలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు. దీనితో పాటు, అధిక రక్తంలో చక్కెర స్థాయి కారణంగా మీకు తల తిరుగుతున్నట్లు కూడా అనిపించవచ్చు.
ఎక్కువ దాహం వేస్తున్నట్లు అనిపించడం..
ఉదయం నిద్రలేవగానే చాలా దాహం వేస్తే, ఈ లక్షణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా సూచిస్తుంది. మీ నోరు కూడా పొడిగా ఉంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. వీటితోపాటు.. ఉదయం తలనొప్పిగా అనిపించడం కూడా చక్కెర స్థాయికి పెరిగిన సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
అస్పష్టమైన దృష్టి సమస్య..
అధిక రక్తంలో చక్కెర స్థాయి కారణంగా మీ కంటి చూపు కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల, దృష్టి మసకబారడం వంటి సమస్య తలెత్తవచ్చు. అంతేకాకుండా, కళ్ళలో మంటగా అనిపించడం కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందని సూచిస్తుంది. మీరు అలాంటి లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..