గంజాయి తరలించే వారు ప్రతిసారీ ఒక్కో తరహాలో ప్లాన్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా ఎవరికీ అనుమానం రాకుండా అక్రమంగా సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఒక ముఠాను మెదక్ ఎన్ఫోర్స్మెంట్, సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు అటుగా వచ్చిన ఓ ఆటోలో తనిఖీ చేయగా.. లోపల సీటు వెనకాల స్పీకరు బాక్సులో పెట్టి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన కంచె రాకేష్, నాంపల్లికి చెందిన శుభం, ధర్మరాజు సాయి కుమార్, లంగర్ హౌస్‌కు చెందిన పోరంపల్లి శ్రీకాంత్‌లు బీదర్ నుంచి గంజాయి తీసుకొస్తున్నారు. ఆటోలో సీటు వెనకాల ఉన్న స్పీకర్ బాక్సులో దీనిని దాచిపెట్టారు. కవర్లో ఉంచిన అరకిలో ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న స్కూటీ, నాలుగు మొబైల్ ఫోన్లనూ సీజ్ చేశారు. గోవా నుంచి వస్తున్న వాహనాలనూ తనిఖీ చేశారు. వివిధ బ్రాండ్లకు సంబంధించి 3.30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుంకం చెల్లించకుండా ఈ మద్యం తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..