ఉద్యోగం కోసమని దుబాయ్ వెళ్లిన ఒక యువతి ఎయిర్‌పోర్టులో డ్రగ్స్‌తో పట్టుబడింది. దీంతో అమెను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని కిషన్‌బాగ్‌కు చెందిన అమీనా బేగం విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కొంది. పాతబస్తీకి చెందిన కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు దుబాయ్‌లో మంచి ఉద్యోగం కల్పిస్తామని అమినాకు ఆశ చూపించి దుబాయ్ తీసుకెళ్లారు. అయితే దుబాయ్ విమానాశ్రయంలో ఆమెను అధికారులు తనిఖీలు చేసి, ఆమె దుస్తుల్లో డ్రగ్స్‌ను గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు.
కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, ఆమెకు ఈ విషయం పూర్తిగా తెలియకుండానే, ఏజెంట్‌లు తన దుస్తుల్లో డ్రగ్స్‌ను దాచారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమీనా బేగం నిరాపరాధి అని వారు వాదిస్తున్నారు. ఇలాంటి ఘోర సంఘటనతో ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన అమీనా, కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలనే ఆలోచనతోనే విదేశాలకు వెళ్లిందని వారు చెబుతున్నారు. ఆమెను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమీనాను తక్షణమే విడుదల చేసి భారత్‌కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేఖల రూపంలో తెలియజేసిన అమీనా బంధువులు, వారి కోరికలను ప్రభుత్వానికి చేరవేశారు. విదేశాల్లో ఇలాంటి మోసపూరిత వలల నుండి మహిళలను రక్షించేందుకు కఠినమైన విధానాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమీనాకు వలపన్నగా దుస్తుల్లో డ్రగ్స్ పెట్టిన విషయం బట్టి చూస్తే, ఇది ఒక మాఫియా రాకెట్‌కు చెందిన పద్ధతి కావచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇది ఒక వ్యక్తిగత ఘటన కాదు, ఇది భారతీయ మహిళలు ఎలా మోసపోతున్నారన్న దానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
ఇలాంటి కేసులు గల్ఫ్ దేశాల్లో తరచూ వెలుగుచూస్తున్నా, నిర్దోషులైన వారు అక్కడి కఠిన చట్టాల కింద భారీ శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీని వల్ల భారతీయ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. మానవ హక్కులు, దౌత్య సంబంధాల దృష్టితో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమీనాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని వాళ్లు పర్కొన్నారు. ఒక అమాయకురాలి జీవితాన్ని డ్రగ్స్ మాఫియా నాశనం చేయకముందే చర్య తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ దౌత్యశాఖతో పాటు గల్ఫ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు కూడా స్పందించి, ఈ విషయాన్ని ప్రాధాన్యతతో పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.