కింగ్డమ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. జూలై 31న విడుదల కానుంది ఈ చిత్రం. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి బయటికొచ్చింది. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిత్ర దర్శకుడు గౌతమ్, హీరో విజయ్ను ఇంటర్వ్యూ చేసారు.
ఇందులో చాలా విషయాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా కింగ్డమ్ మేకింగ్ గురించి బాగా ఓపెన్ అయిపోయారు గౌతమ్ తిన్ననూరి, విజయ్.. చాలా విషయాలు రివీల్ చేసారు. శ్రీలంకలోని క్యాండీలో ఉన్న 200 ఏళ్ల నాటి జైలు సీక్వెన్స్ అంతా సినిమాకు హైలైట్ అవుతుందని.. దాంతో పాటు ఇంకా చాలా యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయంటున్నారు గౌతమ్.
అంతేకాదు.. బాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌పై కూడా చెప్పుకొచ్చారు గౌతమ్. హిందీలో హీరోలు 8 గంటలకు మించి పనిచేయరని.. కానీ మన దగ్గర ఎప్పుడైనా ఓకే అంటారన్నారు గౌతమ్ తిన్ననూరి. ఇదే ఇంటర్వ్యూలో స్పిరిట్ అప్డేట్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా.
విజయ్ దేవరకొండ ముచ్చటపడి మరీ ప్రభాస్ సినిమా గురించి అడిగారు. సెప్టెంబర్ చివర్నుంచి మొదలుపెట్టి నాన్ స్టాప్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు సందీప్ వంగా. 2026లోనే సినిమా విడుదల కానుంది. మొత్తానికి ఒకే ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు కింగ్డమ్ బాయ్స్.