
పిల్లలు చదువులో రాణించాలంటే వారి మెదడు చురుగ్గా ఉండటం చాలా అవసరం. నేర్చుకున్న ప్రతి విషయాన్ని బాగా గుర్తుంచుకోవడానికి జ్ఞాపకశక్తి కీలకం. అయితే చదువు, చదువు అని పదే పదే చెప్పే తల్లిదండ్రులు అసలు చదివింది మెదడులో ఎలా నిలిచిపోతుందో చెప్పడం మర్చిపోతుంటారు. కాబట్టి ఈసారి మీ పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తికి కొత్త కోణం
పిల్లలకు కొత్త విషయాలు నేర్పేటప్పుడు.. ఏదైనా ఒక ప్రత్యేకమైన వాసనను జత చేయండి. ఉదాహరణకు ఒక పాఠం చదివేటప్పుడు నిమ్మకాయ వాసన గల వస్తువును పక్కన పెట్టండి. అదే వాసనను తరచుగా పీల్చుకుంటూ ఆ పాఠం చదివితే.. ఆ విషయం మెదడులో మరింత బలంగా నిలిచిపోతుంది. ఇది చిన్నతనంలోనే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
మెదడుకు పని చెప్పండి
పిల్లలకు ఒక ప్రశ్న అడిగే ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుంది..? అని ఊహించేలా చేయండి. వాళ్లు తప్పు సమాధానం చెప్పినా పర్వాలేదు. అలా ఊహించడం వల్ల ఆ అంశంపై వారికి ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు సరైన సమాధానం చెప్పినప్పుడు.. అది వారి మెదడులో స్పష్టంగా, బలంగా నిలుస్తుంది. మతిమరుపును తగ్గించడానికి ఇది మంచి పద్ధతి.
బొమ్మలతో మాట్లాడించండి
కొందరు పిల్లలు తమకు తెలిసిన విషయాలను తల్లిదండ్రులకు లేదా టీచర్లకు చెప్పడానికి భయపడతారు. అలాంటి సమయంలో ఒక బొమ్మతో ఆ విషయాన్ని చెప్పమని అడగండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బొమ్మతో మాట్లాడేటప్పుడు.. వారు నేర్చుకున్న విషయాన్ని సరిగ్గా గుర్తు చేసుకుంటారు.
పాటల్లో చదువు
పిల్లలు తాము నేర్చుకున్న విషయాల ఆధారంగా చిన్నచిన్న పాటలు లేదా రైమ్స్ తయారు చేసేలా ప్రోత్సహించండి. ఉదాహరణకు గ్రహాల పేర్లతో వాళ్లు ఒక పాట తయారు చేస్తే.. అది వారి మెదడులో ఎక్కువసేపు నిలుస్తుంది. రాగం, తాళం కలిపిన విషయాలు మెదడులోని రెండు భాగాల అభివృద్ధికి సహాయపడతాయి.
జ్ఞాపకశక్తికి మ్యాజిక్
పిల్లలు పడుకునే సమయంలో ఆ రోజు వారు నేర్చుకున్న విషయాలను నెమ్మదిగా చదవమని లేదా చెప్పమని ప్రోత్సహించండి. నిద్రలో మెదడు నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది మెదడులో మరింత బలంగా నిలిచిపోవడానికి సహాయపడుతుంది.
ఊహాశక్తితో జ్ఞాపకశక్తి
పిల్లలు ఏదైనా బొమ్మ గీసేటప్పుడు వారికి కనిపించిన దాన్ని కాకుండా.. కనిపించనిది ఎలా ఉంటుందో ఊహించి గీయమని చెప్పండి. ఉదాహరణకు ఒక గదిలో వానవిల్లు ఉంటే ఎలా ఉంటుంది..? లేదా ఒక చెట్టు తలకిందులుగా పెరిగితే ఎలా కనిపిస్తుంది..? వంటి ప్రశ్నలు వారి సృజనాత్మకతను పెంచుతాయి. ఈ రకమైన ఆలోచన మెదడును చురుగ్గా చేసి జ్ఞాపకశక్తిని సహజంగా మెరుగుపరుస్తుంది.
పిల్లల మెదడు చాలా శక్తివంతమైంది. దాన్ని సరిగ్గా వాడితే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఈ చిన్న చిన్న అలవాట్లు, సరదా పద్ధతులు వాళ్లకు బాగా ఉపయోగపడతాయి. ఈ చిట్కాలతో మీ పిల్లలు చదువులో రాణిస్తారు, నేర్చుకున్నవి బాగా గుర్తుంచుకుంటారు.