యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా డైలీ కోట్లాది రూపాయల లావాదేవిలు జరుగుతున్నాయి.. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్లు చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.. అయితే.. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్‌కు ఆర్బీఐ ఎటువంటి ఛార్జీలు విధించడం లేదు. గతంలో యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు వేస్తారని ప్రచారం జరిగినా.. అటువంటిది ఏమి లేదని కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. ఈ తరుణంలోనే.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ పేమెంట్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చంటూ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కొనసాగించాలంటే ఎవరోఒకరు ఖర్చును భరించాల్సి ఉంటుందని.. దీంతో ఉచిత యూపీఐ లావాదేవీలు శాశ్వతంగా ఉండవని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇటీవల, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా UPI లావాదేవీలపై ఛార్జీలు విధించడం గురించి మాట్లాడంతో.. రాబోయే కాలంలో, ప్రభుత్వం అలాంటి లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాతోపాటు.. కొన్ని మీడియా నివేదికలు కూడా ప్రభుత్వం రూ.2000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని యోచిస్తోందని ప్రసారం చేశాయి. దీనిపై కేంద్రం స్పందించి క్లారిటీ ఇచ్చింది.. దీంతోపాటు.. ఇటీవల, కేంద్ర ప్రభుత్వం రూ.2000 కంటే ఎక్కువ లావాదేవీలపై GST విధించాలని యోచిస్తోందా..? అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
జీఎస్టీ విధించే ఉద్దేశం లేదు..
వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై GST విధించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తన సమాధానంతో, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై GST విధించాలని యోచిస్తోందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
రూ. 2000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఎటువంటి సిఫార్సు చేయలేదని పంకజ్ చౌదరి అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు ఆధారంగా జీఎస్టీ రేట్లు, మినహాయింపులు నిర్ణయించబడతాయని కూడా ఆయన అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగ సంస్థ.. ఇందులో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు) సభ్యులు ఉంటారు.
ఆదాయంలో ఎలాంటి తగ్గుదల లేదు..
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో ఎలాంటి తగ్గుదలకు భయపడటం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అన్నారు. 2025-26 బడ్జెట్ అంచనా లక్ష్యాన్ని సాధించడమే దీని లక్ష్యం. 2025-26 సంవత్సరానికి ఆర్థిక లోటు దాదాపు రూ. 15.69 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది జిడిపిలో 4.4 శాతం ఉంటుందన్నారు.
దీనితో పాటు, చౌదరి ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉద్యోగుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మార్చి 31, 2025 నాటికి 96 శాతం మంది ఉద్యోగులు వారి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉన్నారని అన్నారు. ‘పదవీ విరమణ, కొన్ని ఆకస్మిక రాజీనామాలు వంటి ఇతర కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉంది. గత ఐదు సంవత్సరాలలో, బ్యాంకులు 1,48,687 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 48,570 మంది ఉద్యోగుల నియామకం జరుగుతోందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..