నేటి వేగవంతమైన ప్రపంచంలో పనిలో ఒత్తిడి , పోటీతత్వం నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు ‘బర్న్అవుట్’ తీవ్రమైన సమస్యగా మారింది. బర్న్అవుట్ అంటే తీవ్రమైన, ఒత్తిడితో కూడిన స్థితి అని అర్ధం. ఈ బర్నౌట్ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాదు శారీరక ఆరోగ్యం, ఉత్పాదకత, కుటుంబ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సమస్యను నివారించడానికి కొన్ని ప్రభావవంతమైన పద్ధతులను అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పని-వ్యక్తిగత జీవిత సమతుల్యతను కాపాడుకోండి
పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నిరంతర పని శరీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ఆఫీసులో పనిని సమయానికి ముగించి.. మిగిలిన సమయంలో మీ కుటుంబం సభ్యులతో, స్నేహితులతో గడపడానికి లేదా మీ అభిరుచుల కోసం సమయం కేటాయించండి. సెలవులను ఆస్వాదించండి. డిజిటల్ డిటాక్స్ (మొబైల్/ల్యాప్టాప్ నుంచి దూరం)కు దూరంగా ఉండండి. తద్వారా మనస్సుకి విశ్రాంతి ఇవ్వండి.
ప్రాధాన్యతను సెట్ చేసుకోండి
మనం అన్ని పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నించినప్పుడు తరచుగా బర్న్అవుట్ అవుతాం. ఈ సమస్యని నివారించడానికి.. చేయాల్సిన పనులను వాటి ప్రాధాన్యత ఆధారంగా ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించుకోవాలి. పోమోడోరో టెక్నిక్ (25 నిమిషాల పని + 5 నిమిషాల విరామం) లేదా ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అంటే చేసే పనులు అత్యవసరం, అత్యవసరం కానివిగా విభజించడం వంటి సమయ నిర్వహణ పద్ధతులను ఉపయోగించాలి.
ఇవి కూడా చదవండి
క్రమం తప్పకుండా విరామం
నిరంతర పని చేస్తూ ఉంటే మనస్సు మందకొడిగా మారుతుంది. చేసే పనిలో సృజనాత్మకత తగ్గుతుంది. పని చేస్తున్నప్పుడు ప్రతి 1-2 గంటలకు 5-10 నిమిషాలు విరామం తీసుకోండి. ఈ సమయంలో అటు ఇటు నడవండి. కాళ్ళు చేతులను సాగదీసి రిలాక్స్ అవ్వండి. లేదా కొంచెం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఇలా చేయడం శక్తి స్థాయిని నిర్వహిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి
శారీరక, మానసిక ఆరోగ్యం బర్నౌట్తో నేరుగా ముడిపడి ఉంటుంది. కనుక క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయవడం వలన ప్రశాంతంగా ఉంటుంది. కెఫిన్, అధిక చక్కెర ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. వీటిని తినడం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది.
“వద్దు” అని చెప్పడం నేర్చుకోండి
మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా.. మొహమాటంతో నో అని చెప్పలేక మనం చేయలేకపోయినా.. అవసరం అయిన దానికంటే ఎక్కువ పనిని చేయాల్సి ఉంటుంది. ఇది కూడా బర్న్ అవుట్ కు దారితీస్తుంది. కనుక మీ సామర్థ్యానికి అనుగుణంగా పని చేయండి. అవసరమైనప్పుడు “వద్దు” అని చెప్పే గుణం కలిగి ఉండాలి. ఇలా నో చెప్పడం వలన అనవసరమైన ఒత్తిడి నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకున్నట్లు అవుతుంది.
సహోద్యోగులతో, యాజమాన్యంతో మాట్లాడండి
పనిభారం ఎక్కువగా ఉంటే.. మీ మేనేజర్ లేదా మీ బృందంతో చర్చించండి. పనిని బృందంతో పంచుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచే విధంగా ఉద్యోగస్తులను ప్రేరేపించండి. పని ఒత్తిడిని ఒంటరిగా భరించడం కంటే సహాయం కోరడం మంచిది.
విజయం వస్తే పార్టీ చేసుకోండి
పని ఒత్తిడి కారణంగా.. చిన్న చిన్న విజయాలను కూడా విస్మరిస్తాము. ప్రతి చిన్న విజయం.. అముల్యమే.. విజయం వచ్చినప్పుడు చేసుకునే పార్టీ.. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకున్నట్లే.. ఇది ప్రేరణను కొనసాగిస్తుంది. మీ మనసు నుంచి ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది.
వృత్తిపరమైన సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు
ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగిపోతుంటే..ఆ ఒత్తిడిని నిర్వహించలేకపోతున్నామని మీరు భావిస్తే.. వెంటనే కౌన్సెలర్ లేదా మనస్తత్వవేత్తను సంప్రదించండి. మానసిక ఆరోగ్యాన్ని విస్మరించవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)