క్రెడిట్ కార్డు.. ఇది మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారింది. ప్రధానంగా యువత క్రెడిట్ కార్డులతో అప్పుల పాలు అవుతున్నారు. కార్డు ఉండడంతో ఎడాపెడా వాడేయడం.. తీరా బిల్ వచ్చాక కట్టడానికి డబ్బుల్లే తీవ్ర అవస్థలు పడడం కామన్‌గా మారింది. దేశంలో మధ్యతరగతి ప్రజల క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 33 వేల కోట్లుగా ఉంది. అవును ప్రజలు తమ ఖర్చులు, అభిరుచులను నెరవేర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారు. కానీ దాని బకాయిలను చెల్లించలేకపోతున్నారు. 3 నెలల నుండి 12 నెలల మధ్య కార్డు నుండి తీసుకున్న రుణం రూ. 33,886.5 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం మార్చి 2024లో రూ. 23,475.6 కోట్ల కంటే చాలా ఎక్కువ.
డేటా ప్రకారం.. 91 – 360 రోజుల మధ్య గడువు ముగిసిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు కేవలం ఒక సంవత్సరంలోనే 44శాతం పెరిగాయి. అంటే మార్చి 2025 నాటికి దాదాపు రూ. 34,000 కోట్ల క్రెడిట్ కార్డ్ బకాయిలు మూడు నెలలకు పైగా చెల్లించలేదు. 91-360 రోజుల ఓవర్‌డ్యూ కేటగిరీలో బకాయి మొత్తం 44శాతం కంటే ఎక్కువ పెరిగింది. అదే సమయంలో 91-180 రోజుల కేటగిరీలో బకాయి మొత్తం రూ. 29,983.6 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం రూ. 20,872.6 కోట్లకు పైగా ఉంది. దీనితో పాటు 181-360 రోజులకు బకాయి మొత్తం 1.1 శాతానికి పెరిగింది. ఇది 2024 సంవత్సరంలో 0.8 శాతంగా ఉంది.
వేగంగా పెరుగుతున్న వినియోగం
క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. మార్చి 2025 నాటికి, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల విలువ రూ. 21.09 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం రూ. 18.31 లక్షల కోట్ల కంటే 15శాతం ఎక్కువ. అదే సమయంలో మే 2025లోనే, క్రెడిట్ కార్డు ద్వారా రూ. 1.89 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. మే 2025 నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య 11.11 కోట్లకు పెరిగింది. ఇది జనవరి 2021లో కేవలం 6.10 కోట్లు మాత్రమే.
ఈ రోజుల్లో బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు క్యాష్‌బ్యాక్, ఈఎంఐపై చాలా ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇది క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్యను విపరీతంగా పెంచింది. కానీ, చెల్లింపు సకాలంలో చేయకపోతే 42-46శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఇది ప్రజలను అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తుంది. క్రెడిట్ కార్డులను ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఉపయోగిస్తారు. జీతం రాగనే బిల్ కట్టేదాం అనుకుంటారు. అయితే ఖర్చులు ఎక్కువ ఉండడంతో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక పోతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..