మగువలు సొగసరులు. మోము సౌందర్యం ద్విగిణీకృతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖంలో ఇట్టే ఆకర్షించే కనుల అందాన్ని రెట్టింపు చేయడానికి నల్లని కాటుకను దిద్దుకుంటారు. ఇది తమ అందాన్ని పెంచుకోవడానికి మాత్రమేకాదు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
కాటుక దిద్దుకోవడం వల్ల కళ్ళు నల్లగా కనిపిస్తాయి. ముఖం అందంగా మెరిపిపోతుంది. అందుకే మగువలు మేకప్ వేసుకునేటప్పుడు మర్చిపోకుండా కలువ కనులకు కాటుకను అద్దుతారు. అయితే నేటి కాలంలో మార్కెట్లోకి రకరకాల నకిలీ కాటుకలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల కళ్ళు చికాకుగా మారవచ్చు. అంతే కాదు కళ్ళు నీళ్ళు కారడం, కళ్ళు ఎర్రబడటం వంటివి జరగవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం కల్తీ కాటుక వల్ల కళ్ళలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారితే, దృష్టి కోల్పోవచ్చు. సరైన సమయంలో చికిత్స చేస్తే, ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. మీ కళ్లకు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీ కళ్ళను చల్లటి నీటితో బాగా కడుక్కోవాలి. రోజులో ఎక్కువ సార్లు శుభ్రమైన చల్లటి నీటితో కళ్ళను కడుక్కోవాలి. ఇది కాటుకను కడిగివేసి చికాకును తగ్గిస్తుంది.
కళ్ళు చికాకుగా లేదా అసౌకర్యంగా అనిపించినా పదే పదే రుద్దకండి. ఇలా చేస్తే కాటుకను కళ్ళలోకి లోతుగా నెట్టివేసి ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. శుభ్రమైన కాటన్ ప్యాడ్ లేదా టిష్యూతో మెల్లగా తుడవాలి. కల్తీ కాటుక కళ్ళలోకి వెళ్ళడం వల్ల కళ్ళు వాపు వస్తే, చల్లటి నీటిలో నానబెట్టిన దూదిని మీ కళ్ళపై 5-10 నిమిషాలు ఉంచండి. ఇది చికాకు, ఎరుపును తగ్గిస్తుంది.
కళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత, కళ్ళు మూసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే, కాసేపు కళ్ళు మూసుకుని మసక వెలుతురులో కూర్చోవాలి. దీనివల్ల అసౌకర్యం చాలా వరకు తగ్గుతుంది. కళ్ళు తీవ్రంగా చికాకుగా, బాధాకరంగా ఉంటే, ఎరుపు పెరుగుతూనే ఉంటే, వాపు తగ్గకపోతే, దృష్టి మసకబారినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.