శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది హెపటైటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ లక్షలాది మంది అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధికి బలైపోతున్నారు. కానీ దానిని నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స పొందడం ద్వారా ఈ వ్యాధి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధి, దాని లక్షణాలు, వ్యాధిని ఎలా నివారించాలి వాటిపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లమ్‌బర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బ్లమ్‌బర్గ్ హెపటైటిస్ బి వైరస్ (HBV) ను కనుగొన్నాడు. హెపటైటిస్-బి వైరస్ చికిత్సకు రోగనిర్ధారణ పరీక్ష, వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. అతని ఆవిష్కరణ.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది. ఆయన విజయాలు, సహకారాలను స్మరించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్త హెపటైటిస్ రహిత మిషన్‌ను ప్రారంభించింది. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని మొదటిసారిగా 2008లో జరుపుకున్నారు. అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు.
హెపటైటిస్ అంటే ఏమిటి?
హెపటైటిస్ అనేది నిశ్శబ్ద వ్యాధి. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. దీని లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. అందుకే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ వహించడానికి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి అవగాహన పెంచడం, హెపటైటిస్ తీవ్రమైన వ్యాధి అని, సకాలంలో పరీక్షలు, చికిత్సతో దానిని ఎలా నివారించవచ్చో వంటి విషయాలు తెలియజేయడం హెపటైటిస్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
ఇవి కూడా చదవండి
హెపటైటిస్ లక్షణాలు
- అలసట , బలహీనత
- వికారం, వాంతులు
- చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం
- కడుపు నొప్పి
- ముదురు పసుపు మూత్రం
- ఆకలి లేకపోవడం
- కీళ్ల నొప్పి
- జ్వరం
- బరువు తగ్గడం
- కళ్ళు పసుపు రంగులోకి మారడం
హెపటైటిస్ రకాలు
హెపటైటిస్‌లో అనేక రకాలు ఉంటాయి. హెపటైటిస్ A, B, C, D , E. హెపటైటిస్ A , E కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్ B, C, D రక్తం, ఇన్ఫెక్షన్ ఉన్న సిరంజిలు, అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్ A, Eలు హెపటైటిస్ B అంత ప్రమాదకరమైనవి కావు. కానీ హెపటైటిస్ B, C, D వైరస్లు కాలేయాన్ని బలహీనపరుస్తాయి. ఇది క్రమంగా కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
వ్యాధి నియంత్రణ
హెపటైటిస్‌ను నివారించడానికి, ముందుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. సురక్షితమైన ఇంజెక్షన్లు, ఉత్పత్తులను ఉపయోగించాలి. వీలైనంత వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా శుభ్రమైన నీరు తాగాలి. పరిశుభ్రతను పాటించాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.